నిందితుడు సైఫ్‌కు 14 రోజుల రిమాండ్
వరంగల్ కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వరంగల్ కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను శుక్రవారం ఉదయం హన్మకొండ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుడు సైఫ్‌ను వరంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు. అంతకుముందు సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. కేఎంసీ మెడికో ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ వేధించినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
సైఫ్ వాట్సాప్ చాట్, మెడికో ప్రీతి వాట్సాప్ చాట్‌ల నుండి సమాచారం సేకరించినట్టుగా రంగనాథ్ వివరించారు. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్‌లలో మెసేజ్‌లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని సీపీ వివరించారు.