వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో పట్టుబడ్డాడు.

Update: 2022-12-14 02:09 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో పట్టుబడ్డాడు. ఆదిబట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. మిస్టర్ టీ ఎండీ గా ఉన్న కొడుదుల నవీన్ రెడ్డి (29)కి బొంగ్లూర్‌లో బ్యాడ్మింటన్ శిక్షణకు వెళ్లిన సమయంలో బీడీఎస్ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత నవీన్ రెడ్డి వైశాలిని ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. కొంత మంది బంధువులను నేరుగా విద్యార్థిని ఇంటికి పంపాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తల్లిదండ్రులు తిరస్కరించడంతో వైశాలి కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. గతంలో వైశాలితో దిగిన ఫోటోలు విద్యార్థిని తండ్రి దామోదర్ రెడ్డికి చూయించి బ్లాక్ మెయిల్ చేశాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశాడు. ఇది తెలిసిన వైశాలి నవీన్ రెడ్డి, మరో ఇద్దరిపై ఆదిబట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. వైశాలికి పెళ్లి చూపులు అని తెలుసుకున్న నవీన్ రెడ్డి ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేశాడు. వైశాలిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవాలని భావించాడు. తన స్నేహితులు, తన టీ ఫ్రాంచైజీలో పని చేసే 36 మంది సిబ్బందికి విద్యార్థినికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని నమ్మించి కిడ్నాప్ విషయం చెప్పాడు.

కిడ్నాప్ సమయంలో యువతిపై దాడి..

శుక్రవారం ఉదయం 11 గంటలకు నవీన్ రెడ్డి వోల్వో, బొలెరో సహా నాలుగు కార్లు, మరికొన్ని వాహనాల్లో ఇనుపరాడ్లు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అడ్డుకున్న విద్యార్థిని తండ్రి దామోదర్ రెడ్డి, శేఖర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. యువతిని నవీన్, వాజిద్, రాథోడ్ సాయినాథ్, సిద్ధు, చందు కలిసి వోల్వో కారు (టీఎస్ 07 ఎక్స్ హెచ్ 2111)లో ఎక్కించుకుని ఇబ్రహీం పట్నం మీదుగా నల్గొండ వైపు వెళ్లారు. మరోకరితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని యువతిని నవీన్ విపరీతంగా కొట్టాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అందరి ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టించాడు. విషయం సంచలనంగా మారిందని తెలియడంతో భయపడ్డ నవీన్ రెడ్డి సిద్ధు, చందులతో కలిసి మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్లే మార్గంలో కారు నుంచి దిగిపోయాడు. వాజిద్ రాత్రి 8.37 గంటల సమయంలో యువతిని మన్నెగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద దింపాడు. యువతి తండ్రికి ఫోన్ చేయడంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. లైంగిక దాడి జరగలేదని యువతి తెలిపింది. యువతి చెంప, ఎడమకాలు, కుడికన్ను, తలపై గాయాలయ్యాయి. యువతిని దింపిన తర్వాత వాజిద్ కారును తొండుపల్లి సమీపంలో వదిలి వెళ్లాడు.

Read More...

కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అరెస్ట్

Tags:    

Similar News