రిజర్వాయర్ లో దూకి గుర్తుతెలియని వృద్ధుడు ఆత్మహత్య..
మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్లో దూకి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉదయం వైరాలో చోటు చేసుకుంది.
దిశ, వైరా : మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్లో దూకి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉదయం వైరాలో చోటు చేసుకుంది. వైరాలోని మాటూరుపేట వైపు ఉన్న రిజర్వాయర్ లో వృద్ధుడు దూకి బలవన్మరణం చెందాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు రిజర్వాయర్ ఒడ్డు పై చెప్పులు, పై పంచెను వదిలి వెళ్లాడు. ఉదయం 10గంటల సమయంలో రిజర్వాయర్ వద్ద చెప్పులు, పై పంచ ఉన్న విషయాన్ని ఆ ప్రాంతంలో బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కొణిజర్ల హెడ్ కానిస్టేబుల్ డీవి సుబ్బారావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు.
తెల్ల పంచ, తెల్ల చొక్కా వేసుకున్న వృద్ధుడికి కుడి చేతి పై ఏసుక్రీస్తు సిలువ గుర్తు ఉందని పోలీసులు వివరించారు. ఈ వృద్ధుడు వివరాలు తెలిసినవారు వెంటనే కొణిజర్ల పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధుడు వివరాలు తెలిసినవారు 87126 59150, 87125 75059 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు. అన్నం పౌండేషన్ ఆధ్వర్యంలో మృదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొణిజర్ల పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.