చేపల వేటకు వెళ్లి మామా అల్లుళ్ళ మృతి...

చేపల వేటకు వెళ్లి మామ అల్లుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది.

Update: 2024-12-21 09:23 GMT

దిశ, కొండపాక : చేపల వేటకు వెళ్లి మామ అల్లుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లె పహడ్ గ్రామానికి చెందిన గొడుగు శివకుమార్ (30) అనే యువకుడు కుకునూర్ పల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు.

శుక్రవారం రాయపోల్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన కిష్టయ్య తన అల్లుడు గొడుగు శివకుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కుకునూర్ పల్లి మండలం తిప్పారం గ్రామంలోని మల్లన్నసాగర్ కాలువలో చేపలు పట్టడానికి మామ అల్లుడు కలిసి వెళ్లారు. ప్రమాదవశాత్తు మల్లన్న సాగర్ కాలువలో పడి ఇద్దరు మృతి చెందారు. వారి మృతదేహాలను శనివారం గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.


Similar News