దామరచర్లలో భారీ దోపిడీ.. ఏటీఎం లూటీ చేసిన దొంగలు
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం లో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు.
దిశ, మిర్యాలగూడ : నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం లో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎంలో ఉన్న 22 లక్షల 74 వేల 700 రూపాయలు చోరీకి గురైనట్లు తెలుస్తుంది. దుండగులు సీసీ కెమెరాలలో కనిపించకుండా పెప్పర్ పౌడర్‌ను చల్లిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులను బృందాలుగా ఏర్పాటుచేసి డాగ్స్ స్క్వాడ్ తో పరిశీలిస్తున్నారు. దామరచర్ల సమీపంలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా టీంల ద్వారా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.