కొల్లూరులో పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం
మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ముగ్గురు ముసుగు దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు.
దిశ, నవాబుపేట: మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ముగ్గురు ముసుగు దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన 85 వేల రూపాయలను, మరో 5 వేల రూపాయల విలువచేసే నల్ల పూసల పుస్తెలతాడు కొల్లగొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొల్లూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి ఆయన తండ్రి రాజేందర్ రెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం పొద్దున్నే లేచి పొలం వద్దకు వెళ్ళారు. రాజేందర్ రెడ్డి భార్య యాదమ్మ వంట పనులు ముగించుకొని ఇంట్లో మంచం పై నడుం వాల్చింది. అదే సమయంలో ఇంటి ముందు ముఖానికి ముసుగు ధరించిన ఓ అగంతకుడిని కాపలాగా ఉంచి, ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు అగంతకులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న గదిలో దాచి ఉంచిన బీరువా తాళాన్ని తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడుతో బద్దలు కొట్టారు. అనంతరం అందులోని వస్తువులను చిందర వందరగా పడవేసి.. బీరువాలో ఉన్న 85 వేల రూపాయలు దోచుకున్నారు.
అప్పుడే నిద్ర నుండి మేల్కొని ఇంట్లో అలికిడి కావడం గమనించిన యాదమ్మ వారిని చూసి భయభ్రాంతులకు గురై అరవడానికి ప్రయత్నించగా, ఆమెను గమనించిన ఇద్దరు అగంతకులు అరిస్తే చంపుతామని బెదిరించి తమ చేతిలో ఉన్న ఇనుప రాడుతో ఆమె చేతి మణికట్టుపై, కీళ్లపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న నల్ల పూసల పుస్తెలతాడు ను బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. వారు ఇంటి నుంచి పరారైన తర్వాత తేరుకున్న యాదమ్మ లబోదిబోమంటూ అరిచింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి వ్యవసాయ పొలంలో పనులు చేయడానికి వెళ్లిన నాయిని జగదీశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి సమాచారం అందించారు.
వారు వెంటనే ఇంటికి వచ్చి చూసి జరిగిన విషయాన్ని నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును అందుకున్న ఎస్సై విక్రం క్లూస్ టీం తో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ దొంగలకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. కాగా నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇంట్లో వ్యక్తులు ఉన్నా కూడా దర్జాగా పట్టపగలు అగంతకులు నానా బీభత్సం సృష్టించి దోపిడీకి పాల్పడడంతో మండల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వీలైనంత త్వరగా దోపిడీ దొంగలను పట్టుకొని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.