పూర్ణిమ మృతికి కారణమైన వ్యక్తి అరెస్టు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భవాని నగర్ కాలనీలో ఓ యువతి మృతికి కారకుడైన ఓ వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు జవహర్ నగర్ సీఐ సైదయ్య తెలిపారు.
దిశ, జవహర్ నగర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భవాని నగర్ కాలనీలో ఓ యువతి మృతికి కారకుడైన ఓ వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు జవహర్ నగర్ సీఐ సైదయ్య తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైంది. పూర్ణిమ(19) అనే యువతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇదే ప్రాంతానికి చెందిన శివరాత్రి నిఖిల్ (21) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో విసుగు చెందిన యువతి బాత్ రూమ్ క్లీనింగ్ చేసే ఆసిడ్ ను ఈనెల 24వ తేదీ సాయంత్రం తాగింది. ఇంట్లోని వారు గమనించి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృత్యువుతో పోరాడుతూ మృతిచెందింది. విషయం తెలుసుకున్న నిఖిల్ ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ సైదయ్య తన సిబ్బందితో కలిసి అన్ని కోణాల్లో వివరాలను సేకరించారు. ఎట్టకేలకు నిఖిల్ ను 24 గంటల్లో పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి అరెస్టులో చొరవ చూపిన పోలీసులను ఏసీపీ అభినందించారు.