డ్రైవర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
ఇద్దరి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. డీసీఎం డ్రైవర్, జెసిబి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రోజువారీ కూలి మృతి చెందిన సంఘటన శివంపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.
దిశ, శివంపేట్ : ఇద్దరి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. డీసీఎం డ్రైవర్, జెసిబి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రోజువారీ కూలి మృతి చెందిన సంఘటన శివంపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శివంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన చిట్టా బోయిన శంకర్ తన డీసీఎంలో వడ్ల పొట్టు నింపుకోవడానికి అదే గ్రామానికి చెందిన లింగంపల్లి యాదగిరి (45 ) ని దంతాలపల్లి గ్రామంలోని ఓ రైస్ మిల్లుకు తీసుకెళ్లాడు. అయితే లింగంపల్లి యాదగిరి డీసీఎం లో ఉన్న విషయం చూసుకోకుండా శంకర్ జెసిబి డ్రైవర్ రమేష్ యాదగిరిపై పొట్టు నింపాడు. దీంతో యాదగిరి ఊపిరాడక మృతి చెందాడు. డీసీఎం పూర్తిగా నింపిన తర్వాత యాదగిరి కోసం వెతికారు. అతనికి ఫోన్ చేయగా శబ్దంతో గుర్తుపట్టి డీసీఎం లోని వడ్ల పొట్టు మళ్లీ ఖాళీ చేసినా తర్వాత మృతుడు దాంట్లోనే ఉండి శ్వాస ఆడక చనిపోయిన విషయం గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణం వల్ల చనిపోయినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని శివంపేట ఏఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది వెల్దుర్తి ఎస్సై లు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.