చేనేత కార్మికుడి ఉసురు తీసిన అప్పులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మరో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

దిశ, తంగళ్ళపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మరో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం పరికిపల్లి రాజు (65) అనే చేనేత కార్మికుడికి భార్యతోపాటు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్ల వివాహం సమయంలో కొంత డబ్బు అప్పు చేయాల్సి ఉంది. దీనికి తోడు పవర్ లూమ్ లో ఎలాంటి పని దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఇదే సమయంలో చేసిన అప్పులు కట్టలేక సరైన ఉపాధి లేక మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన రాజు సోమవారం సాయంత్రం తన ఇంట్లో బాత్రూం క్లీనింగ్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ తెలిపారు.