రెండో అంతస్తు నుంచి అమ్మమ్మను తోసేసి హత్య చేసిన మనవడు

యాభై రూపాయల కోసం కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ యువకుడు సొంత అమ్మమ్మ ను రెండో ఫ్లోర్ నుంచి కిందకి తోసేసి దారుణ హత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-10-22 15:16 GMT

దిశ, ముషీరాబాద్: యాభై రూపాయల కోసం కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ యువకుడు సొంత అమ్మమ్మ ను రెండో ఫ్లోర్ నుంచి కిందకి తోసేసి దారుణ హత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నికోటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 85 సంవత్సరాల వృద్ధురాలిని ఒక్కసారిగా రెండో ఫ్లోర్ నుంచి కిందపడేయడంతో ఆమె తలకు గాయమై, చేతులు, కాళ్లు విరిగిపోవడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించి గాంధీనగర్ సర్కిల్ ఇనస్పెక్టర్ రాజు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నేరేడు గ్రామానికి చెందిన కొత్తకోట సుశీలమ్మ(85) తన ఇద్దరు కూతుళ్లు కళావతి, మంగమ్మలతో కలిసి ఉన్నికోట సమీపంలో రెండు అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నారు.

సుశీలమ్మ కుమార్తె కళావతి పెద్ద కుమారుడు నితిన్ (30), చిన్న కుమారుడు గోపి (28), వీరితో పాటు మరో కూతురు మంగమ్మ కుమారుడు ఇక్కడే ఉంటున్నారు. కాగా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న కళావతి పెద్ద కుమారుడు నితిన్ (30) తాను డ్యూటీ కి వెళ్లాలని తనకు యాభై రూపాయలు ఇవ్వాలని, తన డ్యూటీ వద్ద డ్రాప్ చేయాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. తమ్ముడు గోపి పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహంతో నితిన్ తన అమ్మమ్మ సుశీలమ్మను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై ఎడమ చేయి రెండు కాళ్ళు విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న గాంధీనగర్ సీఐ రాజు, ఎస్ఐ నయీమ్ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ను పిలిపించి హత్యకు గల కారణాలను సేకరించారు. వృద్ధురాలి మృతదేహాన్ని, కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలు సుశీలమ్మ కుమార్తె కళావతి ఫిర్యాదు మేరకు ఆమె పెద్ద కుమారుడు నితిన్ పై కేసు నమోదు చేసి, నితిన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు.


Similar News