ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
కదులుతున్న రైలు నుండి దిగబోయి ప్లాట్ ఫామ్ రైలు మధ్యలో ఇరుక్కున్న ప్రయాణికుడిని ఆర్పిఎఫ్ సిబ్బంది కాపాడారు.
దిశ, తిరుపతి: కదులుతున్న రైలు నుండి దిగబోయి ప్లాట్ ఫామ్ రైలు మధ్యలో తగలకున్న ప్రయాణికుడిని ఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఖోడంబరి నందిగ్రామ్ పూర్బా మేదినిపూర్ కు చెందిన స్వప్న కుమార్ రాయ్ (44) తిరుపతికి రావడానికి కాట్పాడిలో 12643 స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు విపరీతంగా రద్దీ ఉండడంతో తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చినా కూడా రైలు నుండి కిందకు దిగలేకపోయాడు. ప్రయాణికుల్లో తోసుకుంటూ వచ్చి రైలు దిగడానికి ప్రయత్నించే లోపు తిరుపతి ప్లాట్ఫారం నుండి రైలు కదిలింది. కదిలే రైలు నుండి దిగడానికి ప్రయత్నించి ప్లాట్ఫారం రైలు మధ్యలో స్వప్న కుమార్ రాయ్ కాళ్ళు ఇరుక్కుపోయి రైలు లాక్కుంటూ పోతుంది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న తిరుపతి ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు లోకనాథం సంపూర్ణలు పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలకు తెగించి ప్రయాణికుడు స్వప్న కుమార్ రాయ్ ను సురక్షితంగా రైలు ప్లాట్ఫారం మధ్య నుండి వెలుపలికి తీశారు. ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు ప్రయాణికుడు స్వప్న కుమార్ కు ధైర్యం చెప్పి నీకు ఏమి కాలేదని ధైర్యంగా ఉండమని భరోసానిచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎందుకు దిగావని స్వప్న కుమార్ ని ప్రశ్నించారు. తను కాట్పాడి నుండి రైల్లో వస్తున్నానని తిరుపతిలో దిగి తాను పూరి ఎక్స్ప్రెస్ లో వెళ్లాల్సి ఉందని ప్రయాణికుడు వివరించారు. అయితే రైలు రద్దీగా ఉండటం వలన రైలు కంపార్ట్మెంట్లో ఇరుక్కుపోయానని దిగడానికి ప్రయత్నించే లోపు రైలు కదిలిందని స్వప్న కుమార్ పేర్కొన్నారు.
ఎట్టకేలకు రైలు ప్రమాదం నుండి స్వప్న కుమార్ ని కాపాడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు లోకనాథం సంపూర్ణాలను తిరుపతి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు ప్రశంసించారు. తన ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లుకు ప్రయాణికుడు స్వప్న కుమార్ రాయ్ కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణతో అప్రమత్తంగా విధులు నిర్వహించి ప్రయాణికుడు స్వప్న కుమార్ రాయ్ నీ కాపాడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు లోకనాదం, సంపూర్ణలను రైల్వే ఆర్ పి ఎఫ్ సీఐ మధుసూదన్ రావు అభినందించారు.