Tirupati : అనుమానాస్పద స్థితిలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మృతి
తిరుపతిలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న వెంకటప్రసాద్ అనే అసిస్టెంట్ మేనేజర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
దిశ, వెబ్ డెస్క్: అనుమానాస్పద స్థితిలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందాడు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ లో ఉన్న ప్రైవేట్ బ్యాంకులో వెంకటప్రసాద్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్న అతను.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ.. ఉన్నట్టుండి సోమవారం (అక్టోబర్ 28) నుంచి వెంకటప్రసాద్ కనిపించకుండా పోయాడు. ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన అతను.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అతనుకోసం గాలిస్తున్న పోలీసులకు.. వెంకటప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జిలో ఉన్న వెంకటప్రసాద్ మృతదేహాన్ని కిందికి దించిన పోలీసులు.. అతని శరీరంపై రక్తపు మరకలున్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటప్రసాద్ ను ఎవరైనా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారా ? అతనే ఆత్మహత్య చేసుకున్నాడా ? కుటుంబ కలహాలు కారణమా? బ్యాంకులో ఇబ్బందులున్నాయా ? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.