ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-01-04 05:21 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు శివారులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ బ్లాస్ట్ లో జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్య (54) అనే వ్యక్తి చనిపోగా.. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలవగా హైదరాబాద్ కు తరలించారు. మరో ఇద్దరికి కార్మికులకు గాయాలవగా మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కిమ్స్ ఆసుపత్రులకు తరలించారు. కంపెనీలో ఉదయం 9:45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3 లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో బిల్డింగ్ లో మొత్తం నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. లంచ్ సమయం కావడంతో కార్మికులంతా బయటకు రాగా‌.. నలుగురు మాత్రమే బిల్డింగ్ లో ఉన్నారు. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ సమయంలో భారీ సౌండ్ ఏర్పడింది.

ప్రమాద స్థలానికి వెళ్లడానికి సమయం పడుతుందని, పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పరిశ్రమ డైరెక్టర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. బ్లాస్టింగ్ ఘటన యాదగిరిగుట్ట మండలంలోని సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు పరిశ్రమ చుట్టూరా భారీ శబ్దం వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని బీర్ల అయిలయ్య సందర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, యాజమాన్యం కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంది కానీ కార్మికుల సేఫ్టీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం. ఈ ఘటన పై సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడినట్లు, గతంలో కూడా ఈ సేఫ్టీ పై హెచ్చరించినట్లు చెప్పారు. పరిశ్రమలో కనీసం ఒక అంబులెన్స్ లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల ప్రాణాలతో పరిశ్రమ చెలగాటమాడుతోందని విమర్శించారు. కచ్చితంగా ఈ ఘటన పై పరిశ్రమ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని, మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలను పరిశ్రమ ఆదుకోవాలన్నారు.


Similar News