Accident: రెండు రాష్ట్రాల మధ్య పేచీ.. నాలుగు గంటలు రోడ్డుపైనే మృతదేహం..!

రెండు రాష్ట్రాల మధ్య మృతదేహం గురించి పేచీ జరిగింది. మా పరిధి కాదంటే.. మాపరిధి కాదంటూ దాటవేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2025-01-06 06:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రాష్ట్రాల మధ్య మృతదేహం గురించి పేచీ జరిగింది. మా పరిధి కాదంటే.. మాపరిధి కాదంటూ దాటవేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh), మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) పోలీసుల నిర్వాకంతో కొన్ని గంటలపాటు రోడ్డు పైనే వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌(Harpalpur police station) పరిధిలో రోడ్డుదాటుతండగా వాహనం ఢీకొని రాహుల్ అహిర్వార్‌ అనే వ్యక్తి చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఇది ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత వారు వెళ్లిపోయారు. దీంతో, గ్రామస్థులు ఉత్తరప్రదేశ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. ఈ పరిధి మధ్యప్రదేశ్ పోలీసులదని వారు వెళ్లిపోయారు. దీంతో, స్థానికులు రోడ్డును దిగ్బంధించి నిరసన చేపట్టారు. ఎట్టకేలకు నాలుగు గంట తర్వాత డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. ఆ తర్వాతే గ్రామస్థులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

బంధువుల ఆగ్రహం

అయితే, రాహుల్ కి ఇటీవలే వివాహం జరిగిందని.. కూలీ పనిపైన ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు వెల్లడించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరగగా.. రాత్రి 11 గంటల వరకు రోడ్డుపైనే డెడ్ బాడీ ఉందన్నారు. ఇక, ఘటనాస్థలిలో రాహుల్ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రోడ్డుపై మృతదేహం పక్కనే రోదించారు. "మా బంధువు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ, ఎవరూ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేరు. డెడ్ బాడీ గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. స్పాట్ కి వచ్చిన ఒక మధ్యప్రదేశ్ పోలీసు మమ్మల్ని తిట్టాడు. ఇది తమ పరిధికి రాదని చెప్పాడు. అయితే, మేం త్వరగా శవపరీక్ష చేయాలని కోరుతున్నాం. అది జరిగితేనే అంత్యక్రియలు నిర్వహించవచ్చు. అలానే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి.. నిందితుడ్ని త్వరగా అరెస్టు చేయాలి” అని మృతుడి బంధువులు తెలిపారు.

Tags:    

Similar News