విటాలిటీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యం..కూలీ మృతి
బిల్డింగ్ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఓ కూలీ నిండు ప్రాణం
దిశ, కుత్బుల్లాపూర్ : బిల్డింగ్ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఓ కూలీ నిండు ప్రాణం బలైంది. బాచుపల్లి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చందన్ దాస్ (55) తన కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి ప్రగతి నగర్ సమీపంలోని సింహపురి కాలనీ నగేష్ లేబర్ క్యాంప్ లో నివాసం ఉంటున్నాడు.ప్రగతి నగర్ కమాన్ సమీపంలో విటాలిటీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ అవాలన్ విష్టాస్ పేరుతో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతుంది. ఈ నిర్మాణ సంస్థ లో గత కొన్ని నెలలు నుండి చందన్ దాస్ నిర్మాణ రంగ కార్మికుడిగా పనులు చేస్తున్నాడు.
అయితే రోజూ మాదిరి పనులలో భాగంగా చందన్ దాస్(55),తన కూతురు పూజా దాస్ తో కలిసి సోమవారం బిల్డింగ్ నిర్మాణం పనులలో కూలీగా ఉదయం ఏడు గంటల సమయం లో వెళ్లడం జరిగింది. చందన్ దాస్ పదవ అంతస్తులో గల బిల్డింగ్ గోడలకు వాటర్ క్యూరింగ్ చేస్తుండగా కూతురు పూజా దాస్ గ్రౌండ్ ఫ్లోర్ లో క్లీనింగ్ పనులు చేస్తుంది.ఇలా ఇరువురు తండ్రీ, కూతురు వీఈఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ లో ఎవరి పనులు వారు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా కాలు జారీ వాటర్ క్యూరింగ్ చేస్తున్న చందన్ దాస్ బిల్డింగ్ పదవ అంతస్తు నుంచి కాలు జారీ కింద పడి పోయాడు.
చందన్ దాస్ తలకు, ముఖానికి బలమైన గాయాలు తగిలి తీవ్రంగా రక్తస్రావం అయింది. చికిత్స కోసం చందన్ దాస్ ను తోటి కార్మికులు బాచుపల్లి లోని మమత హాస్పిటల్ కు తరలించారు.మెరుగైన చికిత్స కోసం చందన్ దాస్ ను మమత హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో పరిశీలించిన వైద్యులు చందన్ దాస్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చందన్ దాస్ కూతురు పూజా దాస్ ఫిర్యాదు మేరకు విటాలిటీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యం మూలంగానే నిర్మాణ కూలీ మృతి చెందినట్లు గుర్తించి ఆ కన్స్ట్రక్షన్ యజమాని, సైట్ బిల్డర్ లపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.