ACB : ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు
ఘట్కేసర్ మున్సిపాలిటీ (Ghatkesar Municipality) ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)అధికారులకు పట్టుబడ్డారు.
దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ (Ghatkesar Municipality) ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)అధికారులకు పట్టుబడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాల ప్రకారం ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఓ కాంట్రాక్టర్ ఈ సంవత్సరం ఎదులాబాద్ లో వినాయక నిమజ్జనాల కోసం మూడు క్రేన్లు ఏర్పాటు చేసి రూ.10 లక్షల కాంటాక్ట్ పనులు చేశాడు. కాంట్రాక్టర్ తాను పనిచేసిన బిల్లు కోసం ఏఈ రాజశేఖర్ని సంప్రదించగా రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
అయితే కాంట్రాక్టర్ అంత మొత్తం చెల్లించలేదని రూ.70 వేల వరకు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సొమ్ము కూడా చెల్లించలేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం కాంట్రాక్టర్కు రూ. 50 వేల నగదు ఇచ్చి ఏఈ రాజశేఖర్ కు బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తాను ఇక్కడ తీసుకోనని తన ఇంటి వద్దకు రమ్మని అక్కడ తీసుకున్నాడు.
కాంట్రాక్టర్ నుంచి ఏఈ రాజశేఖర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్ అంతకు ముందే ఫోన్ పే ద్వారా రూ. 30 వేలు వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీకి బదిలీ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్ ను, సన్నీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇంకా ఈ కేసులో ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.