మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ మోసం..3 కిలోల బంగారంతో పరార్

తాకట్టు పెట్టిన బంగారం తో మేనేజర్ ఉడాయించిన సంఘటన

Update: 2024-10-19 15:29 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : తాకట్టు పెట్టిన బంగారం తో మేనేజర్ ఉడాయించిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోల్డ్ లోన్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తే నెలకు రూ.30 వేల జీతం మాత్రమే వస్తుంది. అదే బంగారం దొంగతనం చేస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరున్ని అవుతాను అనుకున్నాడో ఏమో. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి 3 కిలోల బంగారంతో పరారయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ ప్రాంతానికి చెందిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి వికారాబాద్ ఆలంపల్లి మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ లో 7 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ.3 లక్షల 30 వేలు తీసుకున్నాడు. గత నాలుగు రోజుల క్రితం తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుందామని ఆలంపల్లి గోల్డ్ లోన్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్ళాడు. సర్వర్ ప్రాబ్లమ్ ఉండనే సాకుతో రేపు మాపు అంటూ రెండు రోజులు ఆఫీస్ చుట్టూ తిప్పినట్లు బాధితుడు చెబుతున్నాడు.

అప్పుడే బ్రాంచ్ లో పనిచేస్తున్న ఇతర సిబ్బంది మాట్లాడుకోవడం విన్న అతడికి బ్రాంచ్ మేనేజర్, 63 మంది కస్టమర్లకు చెందిన 63 బంగారం ప్యాకెట్లు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. 3 కిలోలకు పైగా ఉన్న ఆ బంగారం విలువ సుమారు రూ.3 కోట్ల 25 లక్షల పైనే ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గత శుక్రవారం నుంచి వికారాబాద్ లో ఈ న్యూస్ చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆలంపల్లి మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ లో బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు అందరూ శనివారం ఉదయం బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకేసారి వందల మంది వచ్చి మా బంగారం ఉందా..? లేదా..? చెక్ చేసి చెప్పాలని సిబ్బందిని నిలదీశారు. అంతమంది ఒకేసారి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసుల దర్యాప్తు అయిపోయాకే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మణప్పురం గోల్డ్ లోన్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది బాధితులకు భరోసా కల్పిస్తూ.. దేశవ్యాప్తంగా మా బ్రాంచీలు ఉన్నాయని, త్వరలోనే మీ గోల్డ్ మీకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఎవరు అధైర్య పడొద్దు అని భరోసా ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Similar News