Heinous Crime: పైశాచికత్వానికి పరాకాష్ట.. రూ.16 లక్షల కోసం మహిళను 25 ముక్కలు చేసి...

ఆమె శరీరాన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా ఏకంగా 20 ముక్కలుగా నరికి, ఆ ముక్కలన్నింటినీ ఓ మూటకట్టి పక్కనే ఉన్న పొలంలో పడేసిన నిందితుడు...

Update: 2024-11-13 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో ఉద్యోగం పేరుతో భద్రాద్రి జిల్లాకి చెందిన రత్నకుమార్, పార్వతి అనే దంపతులను మోసం చేసి రూ.16 లక్షలు కాజేసి చివరికి వారి చావుకు కారణమయ్యారు ఇద్దరు నిందితులు. కానీ ఇటీవల ఆ క్రైం పార్ట్‌నర్స్ మధ్య కూడా విబేధాలు తలెత్తడం దారుణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతులను ఖమ్మం జిల్లా, కొమ్ముగూడెంకు చెందిన వీరభద్రం, స్వాతి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.16 లక్షలు దోచుకున్నారు. కానీ ఉద్యోగం రాకపోవడం, నెల నెల వడ్డీ పెరుగుతూ పోవడంతో రత్నకుమార్, పార్వతి అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరభద్రం, స్వాతి మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి. దీంతో తనపై కోపంతో స్వాతి రూ.16 లక్షలు వ్యవహారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుందో అనే భయం వీరభద్రంలో మొదలైంది. ఆమెను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు.

మాయమాటలతో స్వాతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. ఆమె శరీరాన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా ఏకంగా 20 ముక్కలుగా నరికి, ఆ ముక్కలన్నింటినీ ఓ మూటకట్టి పక్కనే ఉన్న పొలంలో పడేసిన వీరభద్రం.. ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. అయితే స్వాతి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న భద్రాది పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు.. మూటలో ముక్కలుగా ఉన్న మహిళ మృత దేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ మూటను ఆసుపత్రికి తరలించి బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. ఆ మృతదేహం స్వాతిదేనని గుర్తించారు. అనంతరం హంతకుడి గురించి ఆరా తీయగా.. వీరభద్రమే ఆమెను చంపినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.


Similar News