రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి..
జాతీయ రహదారి పై ఒక ద్విచక్ర వాహనాన్ని మరొక ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
దిశ, ఏటూరునాగారం : జాతీయ రహదారి పై ఒక ద్విచక్ర వాహనాన్ని మరొక ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఏటూరు నాగారం ఓడవాడకు చెందిన గగ్గూరి నగేష్ (40) వృత్తి రిత్యా మత్స్యకారుడు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చేపలు పట్టడానికి గోదావరి నదిలోకి వెళ్లి వల వేసి వచ్చాడు. మళ్లీ అదే రోజు రాత్రి చేపల వల తీయడానికి ఇంటి నుండి 10:30 సమయంలో గోదావరి నది వద్దకు జాతీయ రహదారి 163 మార్గం గుండా వెళ్తున్నాడు.
అదే సమయంలో వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనం పై వస్తున్న రొయ్యూరు శంకరాజ పల్లి గ్రామానికి చెందిన హరి సాయి (30) ప్రమాదవశాత్తు ముందు వెళుతున్న నగేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు నగేష్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక వైపు నుండి ఢీ కొట్టిన హరి సాయి తీవ్ర గాయాల పాలయ్యాడు. తీవ్ర గాయాలపాలైన హరి సాయిని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన గగ్గురి నగేష్ భార్య సుమలత, ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.