హయత్ నగర్ లో వ్యక్తి దారుణ హత్య

అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి అడిగే క్రమంలో వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం ఉదయం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-12-03 14:47 GMT

దిశ, చైతన్యపురి : అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి అడిగే క్రమంలో వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం ఉదయం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దొనకొండ గ్రామానికి చెందిన యక్కలి కాశిరావు (37) తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి భాగ్యలత లోని అరుణోదయ కాలనీ లో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా బిజినెస్ చేస్తున్నాడు. కార్లు అమ్మటం, కొనడం వ్యాపారం చేస్తుండేవాడు. ఇతను నివాసం ఉండే ఇంటి మొదటి అంతస్తులో గత రెండు సంవత్సరాల నుండి పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్ అను వ్యక్తులు సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో బ్యాచిలర్స్ గా కిరాయికి ఉంటున్నారు. వారిలో సాయి, శంకర్ లు ఇద్దరు బొమ్మల గుడి సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఒక సంవత్సరం నుండి పెద్దగాని శేఖర్ కాశిరావుతో కలిసి కార్లు అమ్మడం, కొనడం వ్యాపారం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పెద్దగాని శేఖర్ కాశీరావు దగ్గర జూన్ 2023 సంవత్సరంలో రూ. 1 లక్ష యాభై వేలు, మే 2023 లో 3 లక్షల అరవై వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులను పెద్దగాని శేఖర్ తిరిగి ఇవ్వకపోవడంతో అప్పుడప్పుడు కాశీరావు పెద్దగాని శేఖర్ రూమ్ కి వెళ్లి డబ్బులు గురించి అడిగే సమయంలో శేఖర్ కు కాశీరావుకి మధ్య గొడవలు జరిగాయి. ఇదే విషయమై మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో సాయి, శంకర్ ఇద్దరు తమ రూమ్ నుండి బయటకు వెళ్లిన తర్వాత శేఖర్ ఒక్కడే రూమ్ లో ఉండగా కాశీరావు శేఖర్ ను డబ్బులు అడిగి వస్తానని పైన ఉన్న శేఖర్ వాళ్ళ రూముకి వెళ్లాడు. చాలా సమయం వరకు కాశీరావు కిందికి రాలేదు.

సుమారుగా 10 గంటల 20 నిమిషాల సమయంలో శేఖర్ తన రూమ్ నుండి కిందికి దిగి బయటకు వెళ్తూ క్రింద బట్టలు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతను చూసి నీ భర్తను చంపి పడేశాను అంటూ వెళ్లిపోయాడు. వెంటనే తను పైకి వెళ్లి శేఖర్ వాళ్ళ రూమ్ లో చూడగా వారి బెడ్ రూమ్ లో చాపపైన కాశీరావు మెడ భాగంలో బలమైన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నించగా అప్పటికే కాశీరావు మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రప్పించారు. శేఖర్, కాశీరావు దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని కాశీరావుతో గొడవపడి కాశీరావుని మెడకోసి చంపాడని అతని భార్య యక్కడి సుమలత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.


Similar News