కల్లు దుకాణాల పై తనిఖీ లెక్కడ..?

మనసు ప్రశాంతత కోసం కల్లు సేవించడానికి దుకాణాలకు వస్తున్న కల్లు ప్రియుల గుండెలు గుభేలు మంటున్నాయి.

Update: 2024-09-23 10:42 GMT

దిశ, కామారెడ్డి : మనసు ప్రశాంతత కోసం కల్లు సేవించడానికి దుకాణాలకు వస్తున్న కల్లు ప్రియుల గుండెలు గుభేలు మంటున్నాయి. కల్లు సీసాల్లో దర్శనమిస్తున్న వాటిని చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. సీసాల్లో చెత్తా చెదారం చూసుకోకుండా కల్లు నింపి అవే సీసాలను ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కల్లు ప్రియులు వాటిని గమనించకుండా తాగితే ఇక పరిస్థితులు అంతే సంగతి. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నా.. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్టు కళ్లు ముసుకోవడం పై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

సీసాలు శుభ్రపరచకుండానే కల్లు..

ప్రతిరోజు ఉదయాన్నే కల్లు ముస్తేదారులు దుకాణానికి చేరుకుని కల్లు కలపడం చేస్తుంటారు. డ్రమ్ము, లేదా కుండీలలో కలిపిన కల్లును సీసాల్లో నింపి వాటిని విక్రయిస్తుంటారు. కల్లు సీసాలను నామమాత్రంగా శుభ్రపరిచి సీసాల్లో కల్లు నింపేస్తున్నారు. దాంతో రాత్రంతా విష పురుగులు, చెత్తాచెదారం ఆ సీసాల్లో చేరుకుని అలాగే ఉండిపోతుంది. అవి చూసుకోకుండా అందులోనే కల్లు నింపేసి విక్రయించడంతో కల్లు ప్రియులు కల్లు సేవించేటప్పుడు గమనించి దుకాణ నిర్వహకులతో గొడవలు పడుతున్నారు.

అడ్లూరులో జలగలు ప్రత్యక్షం..

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఆదివారం కల్లు సీసాలో జలగ, నత్త గుల్లలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. జలగ విషపురుగు కావడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కల్లులో ఇలాంటి పురుగులు రావడం ఇదేం కొత్త కాదు. జిల్లాలో రోజుకొక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అడ్లూరు గ్రామంలో జలగ ప్రత్యక్షం కావడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తి చూపింది.

కళ్లు మూసుకున్న ఎక్సైజ్ అధికారులు..

ఇప్పటికే కల్తీ కల్లు విక్రయాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్తేదారుల పై కల్లు సీసాల్లో పురుగులు, చెత్తా చెదారం ప్రత్యక్షం కావడంతో మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కల్లు దుకాణాలను ప్రతినిత్యం తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకుండా కళ్లు మూసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కల్లు దుకాణాలు పరిశీలన చేయడం అధికారుల బాధ్యత. కానీ కల్లు ముస్తేదారులు ఇచ్చే మామూళ్లకు అధికారులు అలవాటు పడి అటువైపుగా తనిఖీలు చేయడానికి వెళ్లడం లేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్లు తయారు చేసేది ముస్తేదారులు.. తాగేది ప్రజలు.. మధ్యలో మనం వెళ్లి అబాసు పాలవడం దేనికన్న ఆలోచనతోనే అధికారులు పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది.

ముస్తేదారుల ఇష్టారాజ్యం..

కల్లు దుకాణాల నిర్వహణ చూస్తున్న ముస్తేదారుల దుకాణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం పై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే ముస్తేదారులు ఇష్టారాజ్యాంగ కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కల్లు సీసాల్లో పురుగులు, బల్లులు, జలగలు, ఇతరత్రా విషపురుగులు ప్రత్యక్షం అవుతున్నా, ఘటనలు పునరావృతం అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు..

మానసిక ప్రశాంతత కోసమో.. పొద్దంతా కష్టం చేసి కష్టాన్ని మర్చిపోవడం కోసమో కల్లు సేవించడానికి కల్లు దుకాణానికి వస్తున్న కల్లు ప్రియులకు ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కల్లు తాగేముందు సీసాలను గమనించకుండా అలాగే తాగితే విష పురుగుల ప్రభావంతో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కల్లు దుకాణాలు నిర్వహిస్తున్న ముస్తేదారులు బాధ్యత వహిస్తారా లేక నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకులే అని కళ్లు మూసుకున్న ఎక్సైజ్ అధికారులు బాధ్యత వహిస్తారా అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ముస్తేదారులు, బట్టీ నిర్వాహకులు కల్లు సీసాలను శుభ్రంగా ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News