IPL ఎఫ్టెక్ట్ : వంటగదిలో కుమారుడిని ఆ స్థితిలో చూసి తల్లి మృతి
ఈ మధ్యకాలంలో యువత బెట్టింగ్‌లకు బాగా బానిసలుగా మారుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో యువత బెట్టింగ్‌లకు బాగా బానిసలుగా మారుతున్నారు. ఈజీగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే నెపంలో క్రికెట్ బెట్టింగుల వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్బు పోగుట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. క్రికెట్ బెట్టింగ్‌లు ఆడి అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణించాడన్న బాధలో తల్లి కూడా చనిపోయింది. వివరాల్లోకి వెళితే..
చాపర్ నగర్ చౌక్ ప్రాంతానికి చెందిన ఖితాన్ వాధ్యానీ అనే యువకుడు తన ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. తండ్రి హోల్ సేల్ వ్యాపారి కాగా తల్లి ఇంట్లోనే ఉండేది. అయితే ఖితాన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బాగా అలవాటు పడి డబ్బులు పోగొట్టేవాడు. ఆఖరికి తన సెల్ ఫోన్ కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్‌లో పెట్టాడు. ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఈ విషయం తల్లికి తెలిసి కొడుకును మందలించింది. తర్వాత సోమవారం కుటుంబసభ్యులందరు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. ఖితాన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
తల్లి మాటలకు మనస్థాపం చెందిన ఖితాన్ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి కొడుకు విగత జీవిగా కనిపించడం చూసి తట్టుకోలేకపోయారు. దీంతో తల్లి దివ్య మనస్థాపంతో స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మరణించింది. తల్లికొడుకులు ఒకేసారి మరణించడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.