కొత్తపేటలో హత్యాయత్నం

పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగంలో సదరు యువకుడు తప్పించుకోగా అతని స్నేహితులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

Update: 2024-12-20 16:38 GMT

దిశ, చైతన్యపురి : పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగంలో సదరు యువకుడు తప్పించుకోగా అతని స్నేహితులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం 2022 సంవత్సరంలో హయత్ నగర్ లో జరిగిన ఓపెళ్లి బరాత్ లో బొడ్డు మహేష్ అనే వ్యక్తికి, ఎన్టీఆర్ నగర్ కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. అప్పట్లో జరిగిన ఆ సంఘటనలో బొడ్డు మహేష్ పై పురుషోత్తం దాడి చేసాడు. ఈకేసు గత కొంతకాలంగా కోర్టులో కొనసాగుతుంది. అదే కేసు విషయంలో ఇరువురు కాంప్రమైజ్ కోసం మాట్లాడుకోగా పురుషోత్తం వద్ద కొంత డబ్బు తీసుకున్న బొడ్డు మహేష్ శుక్రవారం వాయిదా ఉండగా కోర్టుకు రాకుండా సూర్యాపేటలో ఉన్నానని కోర్టు కానిస్టేబుల్ కి చెప్పి హాజరు కాలేదు.

పురుషోత్తం హత్యకు మహేష్ పన్నాగం పన్ని ఈ క్రమంలో శుక్రవారం కేసు నిమిత్తం కోర్టుకు చేరుకున్న పురుషోత్తం మహేష్ కాంప్రమైజ్ రాకుండా సోమవారానికి మరో వాయిదా కోరుకున్నట్లు తెలిసింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న బొడ్డు మహేష్ ఎలాగైనా పురుషోత్తంని హత్య చేయాలని పథక రచన చేసి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పురుషోత్తం చైతన్యపురి నుంచి నాగోల్ కి వెళ్లే రోడ్ లో వైన్స్ వద్ద ఉన్నాడని సమాచారం తెలుసుకున్న బొడ్డు మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, నందనవనం సురేందర్ @సూరి మరో 6మందికి పైగా ఓ కారు, బైక్ లపై వచ్చి పురుషోత్తంపై కత్తులతో దాడికి యత్నించారు. ఈ క్రమంలో పురుషోత్తం కత్తి వేటు తప్పించుకోగా అతని స్నేహితులైన సికింద్రాబాద్ తుకారాం గేట్ కి చెందిన గడ్డమోయిన రాము (28), నాగోల్ తట్టియాన్నారంకు చెందిన పాశం నాగరాజు (28)లకు తీవ్ర గాయాలయ్యాయి.

దాడి సమయంలో బొడ్డు మహేష్ , నందవనం సురేందర్ @ సూరి, బెల్లి భరత్ మరో ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేస్తుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు రాము పరిగెత్తి ఎదురుగా ఉన్న ఫైనాన్స్ ఆఫీసులో తలదాచుకున్నాడు. ఈ దాడి సంఘటనలతో గాయపడిన పురుషోత్తం స్నేహితులైన రాము, నాగరాజులను స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. దాడి జరిగిన తీరు, రక్తం మరకలు, దాడికి పాల్పడిన వివరాలను పోలీసులు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News