దిశ, ఎల్లారెడ్డిపేట : కుల పెద్దలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేటకు చెందిన కొర్రి రమేష్ (48) అదే కులానికి చెందిన కొత్త అరుణ్ కు మధ్య భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఈ విషయంపై అరుణ్ వారి కుల పెద్ద మనుషులకు ఫిర్యాదు చేయగా గొడవపెట్టుకున్న ఇరు వర్గాలను పిలిచి పంచాయితీ నిర్వహించారు. కానీ రమేష్ పెద్దలు చెప్పినట్లు వినలేదు.
దాంతో పెద్దలు రమేష్‌ను కుల బహిష్కరణ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్థానికంగా చిట్టీపాట నడుస్తుండగా రమేష్ సంఘంలో డబ్బులు కట్టడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న వారి కులస్తులైన గడ్డం జితేందర్, బుర్క ధర్మేందర్, లింగాల సందీప్, కొపెల్లి రమేష్, లింగాల దాసు, రేసు శంకర్, మంగురపు అశోకు కలిసి రమేష్ డబ్బులు కట్టొద్దని, కుల బహిష్కరణ చేశామని పేర్కొన్నారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడుగురు కుల సంఘం సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనట్లు స్థానిక ఎస్సై నేరెళ్ల రమాకాంత్ తెలిపారు.