బాచుపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య.. పేరెంట్స్ వచ్చేలోగానే ఆమెను..

బాచుపల్లి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Update: 2024-10-21 02:49 GMT

దిశ, వెబ్ డెస్క్: దసరా సెలవులకు ఇంటికి వచ్చిన కూతుర్ని.. సెలవులు పూర్తయ్యాక తిరిగి కాలేజీ హాస్టల్ లో దింపి ఇంటికి బయల్దేరిన తల్లిదండ్రులు ఊహించని వార్త విన్నారు. తమ కూతురు కళ్లు తిరిగి పడిపోయిందని కాలేజీ యాజమాన్యం ఫోన్ చేయగా.. ఇంటికి వెళ్లే దారి మధ్యలో నుంచే మళ్లీ హాస్టల్ కు వెళ్లారు. ఏమైందోనని కంగారు వచ్చిన తల్లిదండ్రులు తమ కూతుర్ని విగతజీవిగా చూసి హతాశులయ్యారు. ఆదివారం (అక్టోబర్ 20) సాయంత్రం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె (16) బాచుపల్లి చౌరస్తాలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇల్లు దూరం కావడంతో కాలేజీ హాస్టల్ లో చేర్పించారు. అయితే ఆమెకు హాస్టల్ లో ఉండటం ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పింది. చదువుకోసం తప్పదని వారు సర్దిచెప్పేవారని తెలుస్తోంది. దసరా సెలవులు ఇవ్వడంతో.. ఇంటికి వెళ్లిన విద్యార్థినిని తల్లిదండ్రులు హాస్టల్ లో దింపి వెళ్లారు. జాగ్రత్తగా వెళ్లండి.. అమ్మా- నాన్న అని నవ్వుతూ సాగనంపిన ఆమె.. కొద్దిసేపటికే హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చేవరకూ చెప్పలేదు. కళ్లుతిరిగి స్పృహ కోల్పోయిందని త్వరగా రావాలని హాస్టల్ నిర్వాహకులు కబురు పెట్టగా కంగారుగా వచ్చారు. తల్లిదండ్రులు వచ్చేసరికి విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూతురిని విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోధించారు.

తాము హాస్టల్ కు వచ్చేలోపే విద్యార్థిని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. యాజమాన్యం ఒత్తిడుల కారణంగానే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే కాలేజీలో వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్.. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Similar News