భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య
మద్యం అతిగా తాగుతున్నావని, ఏ పని చేయకుండా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుందని భార్య మందలించడంతో భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో చోటు చేసుకుంది.

దిశ,ఏటూరునాగారం : మద్యం అతిగా తాగుతున్నావని, ఏ పని చేయకుండా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుందని భార్య మందలించడంతో భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో చోటు చేసుకుంది. భార్య సనప రమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం ఎల్‌బీ నగర్ గ్రామానికి చెందిన సనప అశ్వపతి(45) గత 15 రోజులుగా విపరీతంగా మద్యం తాగుతూ ఎలాంటి పని చేయకుండా ఉండడంతో అశ్వపతి భార్య సనప రమాదేవి మేనమామ పూనెం రామ్మోహన్ రావు మందలించాడు.
ఇదే క్రమంలో మృతుడి భార్య మేనకోడలు శుభాకార్యం ఉండడంతో ఈనెల 20వ తేదీన మేడారం గ్రామానికి వెళ్లింది. అప్పటి నుంచి ఇంకా అతిగా మద్యం సేవిస్తుండడంతో భార్య మరోసారి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అశ్వపతి 22వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా అశ్వపతి ఆచూకీ లభించలేదు. అదే రోజు సాయంత్రం మేడారం గ్రామానికి చెందిన మేకల కాపరి నార్జ బంధం గుట్టలోకి వెళ్లగా అక్కడ అశ్వపతి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దాంతో కుటంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తన భర్త మరణంపై ఎవరిపైనా అనుమానం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.