Hyderabad Accidents: ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం.. కేపీహెచ్ బీలో వ్యక్తి మృతి
కేపీహెచ్ బీ (KPHB) లో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. కేపీహెచ్ బీ ఫ్లై ఓవర్ (KPHB Fly Over) పై రోడ్డు దాటుతోన్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
దిశ, వెబ్ డెస్క్: శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరిగాయి. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ (ESI Metro Station) వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బళ్లారి నుంచి హైదరాబాద్ కు వచ్చిన గో టూర్ ట్రావెల్స్ (Go Tour Travels) బస్సు.. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి కారును ఢీ కొట్టింది. బస్సు వేగంగా రావడాన్ని గమనించిన పాదచారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం తుక్కు తుక్కయింది. వాహనదారులు, ప్రజలు కేకలు పెట్టడంతో.. కారులో ఉన్న వ్యక్తి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదం అనంతరం బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా.. కేపీహెచ్ బీ (KPHB) లో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. కేపీహెచ్ బీ ఫ్లై ఓవర్ (KPHB Fly Over) పై రోడ్డు దాటుతోన్న వ్యక్తిని బైక్ ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతుడిని నరసింహమూర్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
పేట్ బషీరాబాద్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.