చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..
జిల్లేడు చౌదరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన రెండు చైన్ స్నాచింగ్ బంగారం చోరీ కేసులో నిందితుడైన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
దిశ, చౌదరిగూడ: జిల్లేడు చౌదరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన రెండు చైన్ స్నాచింగ్ బంగారం చోరీ కేసులో నిందితుడైన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. చౌదరిగూడ మండల ఎస్సై సక్రం తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ కిచనతండాకు చెందిన నేనావత్ చందర్ అనే వ్యక్తి పెద్దఎల్కిచెర్ల, చెన్నారెడ్డి గూడ గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలను బైక్ పై వెంబడించి వారి మెడలో నుంచి బంగారు పుస్తెల తాడులను చోరీ చేసి పారిపోయాడు.
దీనిపై కేసు నమోదు చేసి ఛేదించిన చౌదరిగూడ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. రెండు నేరాల విషయంలో షాద్ నగర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాక్షాదారాలను పరిశీలించి నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష 20 వేల జరిమానా విధించినట్లు ఎస్సై సక్రం తెలిపారు.