కుటుంబ కలహాలతో పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య..
ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నకోడూరు మండలం కస్తూరి పల్లి గ్రామానికి చెందిన తేలు సత్యం ముదిరాజ్ (45) ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. రెండో భార్య తేలు శిరీష, కుమారుడు అన్వేష్ (7), కూతురు త్రివేణి (5) కలిసి సిద్దిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
కాగా సత్యంకు రెండో భార్య శిరీషతో ఈ మధ్య కాలంలో గొడవలు జరగడంతో, శిరీష వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన సత్యం వారిని చింతల చెరువులో తోసి ఆపై అతను కూడా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదిస్తుండటంతో పలువురు కంటతడి పెట్టుకుంటున్నారు.