తీహార్ జైలుకు ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ను కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొంది.

Update: 2022-12-03 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ ఆఫీసర్ అంటూ మోసాలకు పాల్పడిన నకిలీ అధికారి శ్రీనివాసరావుకు సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గత ఐదేళ్లుగా సీనియర్ ఐపీఎస్ అంటూ ఆయన అనేక మోసాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఆయన బాధితుల్లో అనేక మంది రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఫేక్ ఆఫీసర్ శ్రీనివాస్ తో వారు దిగిన ఫోటోలు ఉండడంతో ఆయనతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. గ్రానైట్ ఎగుమతుల కేసును మేనేజ్ చేస్తానని మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి శ్రీనివాస్ దగ్గర అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్, భవన్ లను అడ్డాగా చేసుకుని సీబీఐ, ఈడీ కేసులు సెటిల్ మెంట్ చేయిస్తానంటూ వసూళ్ల పర్వానికి శ్రీనివాస్ తెరలేపినట్టు అధికారులు గుర్తించారు. గత ఐదేళ్లుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాసరావుకు ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల నేతలతో పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు అతడిని విచారణ జరిపిన సీబీఐ తాజాగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అతడిని కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరించిన సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు.

Tags:    

Similar News