విద్యుత్ మోటారు సరిచేస్తుండగా కరెంటు షాక్...అక్కడికక్కడే మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, నంగునూరు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కరెడ్ల రామచంద్రారెడ్డి (56) ఉదయాన్నే వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి ఇంటికి పొద్దుపోయినా రాలేదు. దాంతో ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో బావి వద్దకు వెళ్లి చూడగా విద్యుత్ వైరు తగిలి చనిపోయి ఉన్నాడు.
పంపుసెట్ కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో విద్యుత్ వైర్లు తనిఖీ చేస్తుండగా స్తంభం నుంచి స్టార్టర్ కు వెళ్లే విద్యుత్ వైర్లు తగిలి షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న రాజగోపాల్‌పేట ఎస్సై ఆసిఫ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతునికి భార్య నాగవ్వ , నలుగురు కూతుర్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.