వృద్ధుడిని నమ్మించి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ

బ్యాంక్ ఖాతా నుండి అప్పుడే డ్రా చేసిన డబ్బులను మళ్ళీ

Update: 2024-12-19 10:15 GMT

దిశ, వేములవాడ టౌన్ : బ్యాంక్ ఖాతా నుండి అప్పుడే డ్రా చేసిన డబ్బులను మళ్ళీ లెక్కపెట్టి ఇస్తానని వృద్ధుడికి మాయమాటలు చెప్పి డబ్బులతో ఓ వ్యక్తి ఉడాయించాడు.ఈ సంఘటన గురువారం వేములవాడ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో చోటు చేసుకుంది. బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం యూనియన్ బ్యాంక్ వచ్చి తన ఖాతాలో నుంచి రూ. 20 వేలు డ్రా చేశాడు. వాటిని బ్యాంక్ వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్ళీ లెక్కించాలని ఓ దొంగ వృద్ధుడికి మాయమాటలు చెప్పి మళ్ళీ లెక్కించి అందులోని రూ. 7 వేలు తీసుకుని పరారయ్యాడు.

అనుమానం వచ్చిన వృద్ధుడు మళ్ళీ డబ్బులను తిరిగి లెక్కించగా రూ. 13 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వృద్దుడు విషయాన్ని బ్యాంక్ మేనేజర్ కు తెలిపాడు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించిన మేనేజర్ దొంగను పట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఎత్తుకుని వెళ్లిన దొంగ ఓ వైన్స్ షాప్ దగ్గర ఉండటం గమనించిన బ్యాంక్ ఉద్యోగి తాళ్లపల్లి రాజేష్ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకోని పోలీసులకు అప్పగించిన రాజేష్ ను బ్యాంక్ మేనేజర్ అభినందించాడు.


Similar News