బ్యాంక్ ఫ్రాడ్ కేసులో డీసీ వెంకట్రాంరెడ్డి అరెస్ట్
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అధికారులు మంగళవారం రాత్రి డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అధికారులు మంగళవారం రాత్రి డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అదే సమయంలో వెంకట్రాంరెడ్డికి చెంది హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న పధ్నాలుగు ఆస్తులను అటాచ్‌చేశారు. బుధవారం నిందితులు ముగ్గురికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు జడ్జి ఆదేశాల మేరకు చెంచల్‌గూడ జైలుకు రిమాండ్చేశారు. డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి గతంలో పన్నెండు బ్యాంకుల నుంచి 8వేల నూటా ఎనభై కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాడు. ఒక్క కెనరా బ్యాంకు నుంచే 12వందల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒకే ఆస్తి పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో ష్యూరిటీగా పెట్టి రుణాలు తీసుకోవటం. ఇలా బ్యాంకుల నుంచి అప్పులు చేసిన వెంకట్రాంరెడ్డి ఆ తరువాత వాటిని తిరిగి చెల్లించలేదు. దాంతో కెనరా బ్యాంక్అధికారులు 2015లో సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీబీఐ పోలీసులు మోసపూరిత పద్దతుల్లో వెంకట్రాంరెడ్డి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టుగా నిర్ధారించారు.
అప్పుగా తీసుకున్న వేలాది కోట్ల రూపాయలను సొంతానికి వాడుకున్నట్టుగా తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో వెంకట్రాంరెడ్డి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా వెల్లడి కావటంతో ఈడీ అధికారులు కూడా జరిగిన మోసంపై కేసులు నమోదు చేశారు. నిందితులు ప్రివెన్షన్ఆఫ్మనీ లాండరింగ్యాక్ట్ను ఉల్లంఘించినట్టు నిర్ధారించుకున్న ఈడీ అధికారులు గతంలోనే వెంకట్రాంరెడ్డికి చెందిన 386 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్‌చేశారు. తాజాగా మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా వెంకట్రాంరెడ్డితోపాటు డెక్కన్క్రానికల్సీఈఓగా పని చేసిన అయ్యర్, ఆడిటర్మణితోపాటు వెంకట్రాంరెడ్డి తమ్ముడు వినాయక రవిరెడ్డిని విచారణకు రావాల్సిందిగా సూచించారు. వినాయక రవిరెడ్డి మినహా మిగితావారు రాగా మంగళవారం కొన్ని గంటలపాటు ఈడీ అధికారులు వారిని విచారణ చేశారు. అయితే, సరైన జవాబులు ఇవ్వకపోవటం, సమాచారం అందించకపోవటంతో దర్యాప్తునకు సహకరించటం లేదని వెంకట్రాంరెడ్డి, అయ్యర్, మణిని అరెస్టు చేశారు. బుధవారం ఈ ముగ్గురికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి కోర్టులో హాజరుపరిచారు.