రాష్ట్ర రాజధానిలో సంచలనం.. క్షుద్రపూజలతో అత్తమామలను చంపేందుకు కోడలు ప్రయత్నం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేయించి ఓ కోడలు.. అత్తామామలను హతమార్చాలని చూసింది.
దిశ, చార్మినార్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేయించి ఓ కోడలు.. అత్తామామలను హతమార్చాలని చూసింది. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా అల్‌జుబేల్ కాలనీకి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ ఆలీఖాన్, తన సోదరి, తల్లితో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అర్థరాత్రి 10 గంటలకు ఇర్ఫాన్‌ఖాన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీరు చనిపోతురన్నారని బెదిరించి కాల్‌ను కట్ చేశారు. కాసేపటికే ఇర్ఫాన్ ఆలీఖాన్, అతని సోదరితో పాటు తల్లి ఫొటోలకు చేతబడి చేస్తున్న భయంకరమైన వీడియోను సదరు వ్యక్తి వాట్సాప్‌ద్వారా పంపించాడు. దీంతో ఇర్ఫాన్ ఫ్యామిలీ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది.
తమ ఆస్థిని కాజేయడానికి తమను శారీరకంగా, మానసింకంగా దెబ్బతీయడానికి తమ వదిన నాజియానే కుట్రపన్నిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయమై బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి చేతబడికి పాల్పడిన సదరు గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్, సౌత్ ఈస్ట్టాస్క్ఫోర్స్ఇన్స్పెక్టర్ప్రసాద్వర్మ బృందం, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యానాయణ టీమ్‌తో కలిసి పరారీలో ఉన్న బహదూర్ పురా, హసన్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ఖలీం అలియాస్ఖాలీ (48) అనే రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన అత్త, ఆడపడుచు, మరిది ముగ్గురూ కలిసి తనను వేధిస్తున్నారంటూ నాజియా అనే మహిళ మొహమ్మద్ఖలీంను ఆశ్రయించింది.
దీంతో తగినన్ని డబ్బులు ఇస్తే ఈ అమావాస్య తరువాత 48గంటల్లో మీ అత్త, ఆడపడుచు, మరిది భయంకరంగా చచ్చేటట్లు చేస్తానని నాజియాను నమ్మించాడు. ఆ ముగ్గురి ఫొటోలు సేకరించి, వారిపై చేతబడికి పాల్పడుతన్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించి వారికే వాట్సాప్‌లో పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చేతబడికి పాల్పడిన మొహమ్మద్ఖలీంను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బండ్లగూడ పోలీసులకు అప్పగించారు. మొహమ్మద్ఖలీంను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి చేతబడికి సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.