చాలామందికి ఉండే అపోహ.. సైబర్ నేరాల నుంచి కొంత రక్షణ
ప్రస్తుత డిజిటల్ యుగంలో, పిల్లల ఆన్‌లైన్ భద్రత ప్రధాన ఆందోళనగా మారిందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో, పిల్లల ఆన్‌లైన్ భద్రత ప్రధాన ఆందోళనగా మారిందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ఏదైనా స్క్రీన్ టైమ్‌కి తల్లిదండ్రులు పరిమితులను ఏర్పాటు చేస్తేనే సైబర్ నేరాల నుంచి కొంత రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ భద్రత, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలను గుర్తించడానికి పరిష్కరించడానికి మార్గదర్శకాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో విడుదల చేసింది. వివిధ సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్‌గా ఉంటున్న పిల్లలను కంట్రోల్ చేయడానికి సూచనలను ఈ విభాగం తల్లిదండ్రులకు పలు సూచనలు అందించింది. పేరెంటింగ్ కంట్రోల్ విధానంతో డిజిటల్ సేఫ్ ఎన్విరాన్‌మెంట్ సృష్టించడం ద్వారా సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవచ్చని హెచ్చరిస్తున్నది. సైబర్ క్రైమ్ అంటే ఆన్‌లైన్ విధానంలో డబ్బు పోగొట్టుకునేవారు మాత్రమే ఫిర్యాదు చేస్తారనే అపోహ చాలామందికి ఉన్నదని ఆ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడినా, ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా సైబర్ క్రైమ్‌లో పిర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. - దొడ్డపనేని రామ్‌గోపాల్
పేరెంటింగ్ కంట్రోల్ అనేది మొబైల్ ఫోన్స్, టాబ్స్ గాడ్జెట్లలోని సెట్టింగ్స్‌లో కనపడే కంట్రోలింగ్ అప్లికేషన్. ఇది పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షణ, నిర్వహణకు సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగపడతాయి. సైబర్ అనర్థాల నుంచి పిల్లలకు భద్రతను కలిగించేందుకు తోడ్పడుతాయి. ఇంటర్నెట్ వినియోగంతో ప్రపంచంలో అంతులేని సమాచారం అందుబాటులోకి వస్తున్నా.. అదే సమయంలో పిల్లలపై దుష్పరిణామాలకు కూడా కారణం అవుతున్నది. పేరెంటింగ్ కంట్రోల్ అమలు చేయడం వల్ల పిల్లలను అనవసర విషయాలనుంచి రక్షించడానికి, ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించడానికి, రెస్పాన్సిబుల్ ఆన్‌లైన్ వినియోగానికి తోడ్పడుతుంది. అదే సమయంలో తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
యాప్ కంట్రోలింగ్
పిల్లలు వినియోగిస్తున్న సోషల్ మీడియా పేరెంటింగ్ కంట్రోల్ వినియోగంతో సైబర్ నేరాలనుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, యూట్యూబ్, ఎక్స్ ట్వీట్లలో పేరెంటింగ్ కంట్రోల్ సహయంతో నియంత్రణ చేయవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తుంది.
గేమింగ్ కన్సోల్స్ కంట్రోల్
గేమింగ్ కన్సోన్‌లో పేరెంటింగ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది.
* మొబైల్ ఫోన్‌లో అకౌంట్ మేనేజ్మెంట్‌లో సైన్ ఇన్ చేసి, ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఫస్ట్ మెంబర్‌ని యాడ్ చేస్తే.. సెట్ అప్ నౌ > యాడ్ చైల్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* సెకండ్ మెంబర్ యాడ్ చేయాడానికి.. యాడ్ ఫ్యామిలీ మెంబర్ > యాడ్ చైల్డ్ ఎంచుకోవాలి.
* పిల్లల పుట్టిన తేదీని నమోదు చేసి.. నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* వర్తించే చట్టపరమైన నిబంధనలు కనిపిస్తాయి. వాటిని అంగీకరించి.. పేరెంటల్ కంట్రోల్ సెటప్ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తే ప్రాసెస్ అయిపోతుంది.
సైబర్ వేధింపులను గుర్తించడం ఎలా?
* సైబర్ నేరానికి గురైన పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి.
* మానసిక కల్లోలం, ఒంటరితనంగా ఉంటున్నారా? అన్నది పరిశీలించాలి.
* వేధింపులకు పాల్పడినట్టు తెలిస్తే.. అందుకు సాక్ష్యంగా స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లను సేవ్ చేసుకోవాలి.
* సమస్యపై పిల్లలు ఓపెన్‌గా మాట్లాడేలా మోటివేట్ చేయాలి.
* సపోర్టింగ్ కోసం పెరెంట్స్ వద్దకు రావాలనే భరోసా వారికి ఇవ్వాలి.
పోక్సో యాక్ట్
డిజిటల్ మాధ్యమాల్లో పిల్లలకు భద్రత కల్పించేందుకు తల్లిదండ్రులు పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాలి. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోస్కో), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్ )సెక్షన్ 64 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 వంటి ఉపయోగకరమన చట్టాల గురించి తెలియజేస్తున్నాయి. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిచండానికి పోక్సో చట్టం అమలులో ఉంది. ఈ చట్టం ద్వారా పిల్లలకు అశ్లీల, లైంగిక, అసభ్యకరమైన విషయాలనుంచి చట్టబద్ద రక్షణ కల్పిస్తుంది. లైంగిక అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, వంచన, సైబర్ బెదిరింపు, వెంబడించడం, వేధించడాన్ని నేరాలుగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠినశిక్ష పడేలా పోక్సో చట్టం చేయబడింది. పోక్సో చట్టంలో నేరం రుజువైతే జీవిత ఖైదు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నది.