పక్కా సమాచరంతో పట్టుబడిన గంజాయి.. ఇద్దరి అరెస్ట్..
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మేడిపెల్లి ఎస్సై శ్యామ్ రాజ్

దిశ, కోరుట్ల టౌన్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మేడిపెల్లి ఎస్సై శ్యామ్ రాజ్ పట్టుకుని అరెస్టు చేశారు. పట్టుకున్న నిందితుల వివరాలను సోమవారం కోరుట్ల ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్పల్లి డిఎస్పీ రాములు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ హరీష్ , బొల్లపెల్లి అభిషేక్ అలియాస్ విష్ణువర్ధన్ మేడిపెల్లి ఎస్సారెస్పీ శివారులో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించగా గోల్కొండ హరీష్ , బొల్లపెల్లి అభిషేక్ అలియాస్ విష్ణువర్ధన్ లు ఇద్దరు గంజాయి విక్రయిస్తూ కనిపించారని పోలీసులను చూసి అక్కడి నుండి పరారవ్వగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుండి 2 కిలోల 200 గ్రాముల గంజాయి , 2 సెల్ ఫోన్లు లభించియన్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1లక్ష ఉంటుందన్నారు. వీరు ఒరిస్సాకు చెందిన దీపక్ అలియాస్ సూరజ్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. త్వరలో మరో నిందితుడు దీపక్ అలియాస్ సూరజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి, ఎస్సై శ్యామ్ రాజ్ ,సిబ్బంది అనిల్ కుమార్, చంద్ర శేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్ లను నగదు బహుమతితో అభినందించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.