ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా కేకలు వేస్తూ బస్సులో ఏం జరిగిందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోయారు.
దిశ, అలంపూర్ : ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా కేకలు వేస్తూ బస్సులో ఏం జరిగిందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోయారు. ఒక్కసారిగా బస్సు డివైడర్ పై 150 మీటర్ల వరకు దూసుకెళ్తూ ఆగిపోవడం, ఎదురుగా ఇలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మానవపాడు క్రాస్ రోడ్ సమీపంలో 44 జాతీయ రహదారి పై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.
బస్సు డ్రైవర్ రమేష్ మద్యం మత్తులో ఉండడంతో కంటైనర్ ఢీకొన్న సమయంలో బస్సు అదుపుతప్పి డివైడర్ దాటి రాంగ్ రూట్లో 150 మీటర్ల వరకు దూసుకెళ్లింది. అంతే ఒక్కసారిగా ప్రయాణికులు కేకలు వేస్తూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయారు. బస్సు ఆగిన మరుక్షణమే ప్రయాణికులంతా ఆర్తనాదాలు చేస్తూ కిందికి దిగిపోయారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియని పరిస్థితిలో కాసేపు ప్రయాణికులంతా నివ్వెరపోయారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రధాన కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయుంటే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. బస్సులో సుమారు 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. షేక్ మొహమ్మద్ (45), సూర్య తేజలు (30) రక్త గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.