రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. మరుసటి రోజే భర్త మృతి
మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదంలో భార్య పుల్లమ్మ మృతి చెందగా భర్త సిలివేరు ముత్తయ్య (62) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
దిశ, మర్రిగూడ: మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదంలో భార్య పుల్లమ్మ మృతి చెందగా భర్త సిలివేరు ముత్తయ్య (62) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి చెందడంతో ఎరుగండ్ల పెళ్లి గ్రామం శోకసంద్రంలో మునిగింది. పుల్లమ్మ మృతదేహాన్ని శనివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించగా తెల్లవారుజామున ముత్తయ్య మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం . ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన సిలివేరు ముత్తయ్య దంపతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామం కు ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తు మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట డీసీఎం ఢీకొన్న ఘటనలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిన విషయం పాఠకులకు విదితమే. ఉస్మానియా ఆసుపత్రిలో భార్య పుల్లమ్మ తలకు ఆపరేషన్ చేయగా ఆపరేషన్ వికటించి ఆమె శుక్రవారం మృతి చెందింది.
కోమాలో ఉన్న భర్త ముత్తయ్యను వైద్యులు బ్రతికించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. తెల్లవారుజామున 4 గంటలకు ముత్తయ్య కూడా మరణించాడు. దీంతో కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఒకరోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బంధువులతో పాటు ఎర్రగండ్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగింది. కడు పేద కుటుంబానికి చెందిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. మృతదేహాన్ని తీసుకురావడానికి గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిసింది. కుమారుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రంగారెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం పోలీసులు కుటుంబ సభ్యుల తో హైదరాబాదుకు తరలి వెళ్లారు.