AP News:బైక్ దొంగల అరెస్ట్‌.. 19 వాహనాల రికవరీ

వివిధ ప్రాంతాల్లో మోటార్‌ బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నూజివీడు ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్‌ చేసింది.

Update: 2024-10-24 14:44 GMT

దిశ, ఏలూరు: వివిధ ప్రాంతాల్లో మోటార్‌ బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నూజివీడు ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్‌ చేసింది. ఈ వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిశోర్‌ మాట్లాడుతూ నూజివీడు పోలీసులు ముఖ్యమైన ఆపరేషన్‌లో భాగంగా వాహన చోరీకి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 19 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులు తెలంగాణ స్థానికులని నూజివీడు దర్యాప్తు బృందాలు సమన్వయంతో చేసిన ప్రయత్నంతో వారిని అరెస్ట్‌ చేయగలిగారని చెప్పారు.

దొంగిలించబడిన బైక్‌లను నిజమైన యజమానులకు తిరిగి అప్పగించారు. జిల్లా సరిహద్దుల్లో పనిచేస్తున్న అనుమానితుల యొక్క కదలికలను జాగ్రత్తగా ట్రాక్ చేసిన తర్వాత నూజివీడు పోలీసు బృందం వీరిని అరెస్ట్‌ చేసిందన్నారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లు నూజివీడు లోని వివిధ ప్రాంతాల నుండి చోరీకి గురయ్యాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీ అయిన వాహనాలు త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ జూలై నెల నుంచి అక్టోబర్ వరకు, వివిధ కేసుల్లో దొంగిలించబడిన ₹1,93,13,892 విలువైన సొత్తును పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారని ఎస్పీ చెప్పారు. 2023 జులై నుంచి అక్టోబర్ తో పోలిస్తే ఆస్తి గుర్తింపులో 252.0% పెరుగుదల వుందన్నారు. 2023 జులై నెల నుంచి అక్టోబర్ నెల వరకు, ₹1,60,35,700 విలువైన ఆస్తి పోయిందని, దీనిలో ₹54,64,120 తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వివరించారు. 2024 జూలై నుంచి అక్టోబర్ వరకు, ₹3,04,94,213 విలువైన ఆస్తి పోయిందని అందులో ₹1,93,13,892 ని తిరిగి స్వాధీనం చేసుకున్నారని వివరించారు.


Similar News