పసిపిల్లల విక్రయ ముఠా అరెస్ట్.. జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆసుపత్రిలో పని చేస్తూ మాయమాటలు చెప్పి పసికందులను విక్రయిస్తున్న ఓ జంటను మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు
దిశ, మంగళగిరి: ఆసుపత్రిలో పని చేస్తూ మాయమాటలు చెప్పి పసికందులను విక్రయిస్తున్న ఓ జంటను మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 రోజుల పసికందును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జోడుబొమ్మల సెంటర్‌కు చెందిన బొమ్మిడి ఉమాదేవి, త్రినాథ్ దంపతులు రూ.4.60 లక్షలకు ఆ పసికందును కొని, రూ.5 లక్షలకు విక్రయించేందుకు యత్నించినట్లు పట్టణ సీఐ వినోద్ తెలిపారు. ఆ చిన్నారి తల్లిదండ్రులెవరు..? అసలు పాత్రధారులు ఎవరున్నారు..? అన్న విషయాలను ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కీలక నిందితులుగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మరో జంట కోసం గాలిస్తున్నామని అన్నారు. వీరు పట్టుబడితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందని సీఐ వివరించారు.