హత్య కేసులో నిందితుల అరెస్ట్
గత సోమవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్ కు చెందిన బోయిని సాగర్ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కోరుట్ల పోలీసులు తెలిపారు.
దిశ, కోరుట్ల టౌన్ : గత సోమవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్ కు చెందిన బోయిని సాగర్ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కోరుట్ల పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు తెలిపారు. గత ఆదివారం రాత్రి 11 గంటలకు పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన పంబాల మధు, ఇప్పకాయల నరేష్ లతో మృతుడు సాగర్ కు ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుద్దేటి వెంకటేష్ వారి మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నాలు చేశాడు. సాగర్ అందుకు ఒప్పుకొలేదు. గొడవల కారణంగా మధు, నరేష్ లను చంపుతానని సాగర్ బెదిరించాడు. విషయం నిందితులకు తెలిసింది.
దాంతో గత సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తన అనుచరులతో పాటు ప్రకాశం రోడ్ లోని పంబాల నాగరాజుతో కలిసి సాగర్తో గొడవ పడ్డారు. అనంతరం సాగర్ ను బయటకు లాక్కొచ్చి రోడ్డుపై తోసివేయడంతో కింద పడిపోయాడు. అనంతరం వెంకటేష్ తన వద్ద ఉన్న కత్తితో సాగర్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోగా కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై ఎస్. శ్రీకాంత్, సిబ్బంది ఎల్లయ్య, పురుషోత్తం, విజయ్, సత్తయ్య నిందితుల కోసం గాలించారు. గురువారం కోరుట్ల శివారులోని గుద్దేటి వెంకటేష్ కు చెందిన నాగులమ్మ బిక్స్ ఫ్యాక్టరీలో నిందితులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.
వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు బైకులు, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు, మరో నిందితుడు పంబాల నాగరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు, కోరుట్ల ఎస్ఐ ఎస్. శ్రీకాంత్, వారి సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు.