ప్రేమ వేధింపులకు యువతి బలి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వీ నియోజవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువతి నిండు జీవితాన్ని కోల్పోయింది.
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వీ నియోజవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువతి నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బెల్లంపల్లి పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత(21)ను మహమ్మద్ ఖాసీం బస్తికి చెందిన ఈదునూరు శ్రీనాథ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు.
మానసికంగా, శారీరకంగా సదరు యువతని వేధించాడు. ఈ వేధింపులకు తాళలేక సాయి స్నేహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించి ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యం పొందుతూ మంగళవారం కన్ను మూసింది. సాయి స్నేహిత తండ్రి శేషగిరి బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తన కూతురు మరణానికి శ్రీనాథ్ వేధింపులే కారణమని ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు ఎస్హెచ్ఓ దేవయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీఆర్ఎస్వీ నుంచి శ్రీనాథ్ తొలగింపు..
యువతి మరణానికి ప్రధాన కారణమైన ఈదునూరి శ్రీనాథ్ ను టీఆర్ఎస్వీ నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బడకల శ్రావణ్ ప్రకటించారు. సాయి స్నేహితను ప్రేమ పేరుతో వేధించి ఆమె మరణానికి కారణమన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనాథ్ పై చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఈదునూరు శ్రీనాథ్ ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్వీ బెల్లంపల్లి నియోజవర్గ అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి సంఘటనను తాము సహించమని స్పష్టం చేశారు.