కరెంట్ షాక్ కు గురైన బాలికను కాపాడేందుకు వెళ్లి మహిళ మృతి..

రోడ్డుపై విద్యుత్​ స్తంభానికి వేలాడుతున్న తీగలతో విద్యుత్​ షాక్​కు గురైన ఓ ఐదేళ్ల బాలికను కాపాడేందుకు వెళ్లిన మహిళ విద్యుత్​ షాక్​కు గురై మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-06-06 15:38 GMT

దిశ, కూకట్​పల్లి: రోడ్డుపై విద్యుత్​ స్తంభానికి వేలాడుతున్న తీగలతో విద్యుత్​ షాక్​కు గురైన ఓ ఐదేళ్ల బాలికను కాపాడేందుకు వెళ్లిన మహిళ విద్యుత్​ షాక్​కు గురై మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్​ గోదావరి జిల్లా కాకినాడ ప్రతిపాడు మండలం వమ్మంగి గ్రామానికి చెందిన ములికి బాపనమ్మ(32), కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కూకట్​పల్లి అడ్డగుట్ట సొసైటి వెస్ట్రన్​ హిల్స్​ విఆర్​కే అపార్ట్ మెంట్​లో వాచ్​మెన్​గా పని చేస్తుంది.

ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో బాపనమ్మ అపార్ట్ మెంట్​ గేటు వద్ద నిలుచొని ఉంది. అదే సమయంలో ఎదురుగా అపార్ట్ మెంట్​ వద్ద ఓ విద్యుత్​ స్తంభానికి వేలాడుతున్న ఇంటర్నెట్​ కేబుల్​ల వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికకు విద్యుత్​ షాక్ తగలడాన్ని చూసి బాలికను కాపాడేందుకు పరుగు తీసిన బాపనమ్మ బాలికను తోసేసింది. ఈ క్రమంలో బాపనమ్మ విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన స్థానికులు బాపనమ్మను వెంటనే భాగ్యనగర్​ కాలనీలోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బాపనమ్మ మృతి చెందింది. విద్యుత్​ షాక్​ తగిలిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కేపీహెచ్​ బీ ఎస్సై రాజేందర్​​ తెలిపారు.

Tags:    

Similar News