నాలుగు రోజులు నా కోరిక తీర్చు.. నీ చిట్టీ డబ్బులు ఇస్తా.. కామాంధుడైన ఉపాధ్యాయుడు
స్వతంత్రంగా బతికే మహిళలు అంటే అందరికీ చిన్న చూపే.. కష్ట పడి పైసా పైసా కూడ బెట్టి జమ చేసుకున్న వాటితో మెదక్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడి వద్ద మహిళ చిట్టీ వేసింది..
దిశ, మెదక్ ప్రతినిధి: స్వతంత్రంగా బతికే మహిళలు అంటే అందరికీ చిన్న చూపే.. కష్ట పడి పైసా పైసా కూడ బెట్టి జమ చేసుకున్న వాటితో మెదక్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడి వద్ద మహిళ చిట్టీ వేసింది. తాగుబోతు తండ్రి కి బాధ్యత లేక సొంతంగా పెళ్లి కోసం చీట్టీ కడితే తీరా డబ్బులు ఇవ్వమంటే సదరు ఉపాధ్యాయుడు కోరిక తీరిస్తేనే చిట్టి డబ్బులు ఇస్తానంటున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ మహిళా చిరుద్యోగి తాను ఎదుర్కొంటున్న బెదిరింపు లేఖలో తెలిపింది. మెదక్ జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఫిర్యాదు చేసింది. ఆ దుర్మార్గుడి నుంచి కాపాడాలని 15 మందికి ఆర్టీసి కార్గో పార్శిల్ లో బాధితురాలి లేఖలు అందాయి. ఈ సంఘటన మెదక్ పట్టణంలో కలకలం సృష్టించింది. బాధితురాలు లేఖలో పేర్కొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానికురాలైన ఓ మహిళ చిరుద్యోగిగా పనిచేస్తోంది. తన తండ్రి మద్యానికి బానిసగా మారడంతో తన పెళ్లికోసమని జీతంలో నుంచి కొంత పొదుపు చేసి స్థానికంగా చిట్టీలు నిర్వహించే ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర రెండు లక్షల రూపాయల చిట్టీ వేసింది. 26 నెలల చిట్టీ గడువు తీరిపోగా చిట్టీ తాలూకు డబ్బులు ఇవ్వమని అడిగితే ఆ డబ్బులు మీకు ఇస్తే ఖర్చు అయిపోతాయి. నీ పెళ్లి కుదిరినప్పుడు డబ్బులు మీకు ఇస్తాను. అప్పటి వరకు వందకు రెండు రూపాయల చొప్పున మిత్తి ఇస్తానని చెప్పడంతో తనతో పాటు అతడి తల్లి అందుకు ఒప్పుకున్నారు. ఇటీవల పెళ్లి కుదరడంతో ఉపాధ్యాయుడి వద్దకు వెళ్ళి డబ్బులు అడిగితే ఎక్కడివి నీ చిట్టీ డబ్బులు ఎప్పుడో మీ నాన్నకు ఇచ్చేశాను అంటున్నాడని పేర్కొన్నారు. ఇటీవల తాను ఒంటరిగా కలిసినప్పుడు సదరు చిట్టీల నిర్వహకుడైన టీచర్ తనలో ఉన్న కామ వాంఛను బయట పెట్టాడు. 'నీ మీద నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఎలాగూ వచ్చే నెల పెళ్లి కాబట్టి, ఓ నాలుగు రోజులు నా దగ్గర గడుపు అలా అయితే నీ డబ్బులు నీకిస్తా' అంటూ తన దుర్భుద్దిని బయట పెట్టాడని బాధితురాలు తన లేఖలో పేర్కొంది. లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లి కొడుకు వాళ్లతో చెబుతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మీ నాన్నకు ఓ పది వేలిస్తే అతను కూడా అదే చెప్తాడు అంటున్నాడని, కాదని ఎవరి దగ్గరికైనా వెళ్లినా పంచాయతీ పెట్టినా నన్ను అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే నా దగ్గర చిట్టీలు వేసేటోళ్లే ఉన్నారు. నా దగ్గర లెక్కలు పక్కగా ఉంటాయని అందరికి నమ్మకం, నువ్వు చెప్పేది ఎవ్వడు నమ్మడు అంటూ బెదిరిస్తున్నట్టు తెలిపింది. నేను చెప్పినట్టు వింటే మంచిది కాదని పంచాయతీ పెడితే పరువూ పోతుంది. పైసలు పోతాయి, పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. మళ్లీ పెళ్లి కూడా కాదు అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నీతి నిజాయితీగా, పరువుగా బతుకుతున్నతాను ఆత్మాభిమానం చంపుకొని డబ్బుల కోసం శీలాన్ని అమ్ముకోనని, సదరు చిట్టీల నిర్వహకుడు తనను మామూలుగా వదిలేసేలా లేడని, అతనికి లొంగితే ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేలా ఉన్నాడని, ఈ నేపథ్యంలో తాను, తన తల్లి కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అందువల్ల ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు, టీచర్స్ యూనియన్ నాయకులకు మొత్తం 14 మందికి ఆర్టీసీ కార్గో పార్శిల్ లో లేఖలు పంపినట్టు సమాచారం. మెదక్ పట్టణం అంతటా బాధితురాలి లేఖ పైనే చర్చ నడుస్తోంది. అయితే లేఖలో ఆమె వివరాలు మాత్రం తెలపలేదు. విషయం జిల్లా అధికారుల వద్దకు వెళ్లడంతో విచారణ చేస్తున్నారు. మహిళ తన గుర్తింపు బయటకు రాకుండా న్యాయం చేయాలనీ సదరు మహిళ లేఖలో పేర్కొంది.