ఎస్ఎస్ ఎకో మోటార్స్ పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఎస్ఎస్ ఎకో మోటార్స్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తూ గొలుసు కట్టు విధానంలో ఎలక్ట్రిక్ బైక్ లు విక్రయిస్తున్న వ్యక్తితో పాటు యాజమాన్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసు నమోదైంది.
దిశ,వేములవాడ : ఎస్ఎస్ ఎకో మోటార్స్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ చేస్తూ గొలుసు కట్టు విధానంలో ఎలక్ట్రిక్ బైక్ లు విక్రయిస్తున్న వ్యక్తితో పాటు యాజమాన్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసు నమోదైంది. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలంలోని శభాష్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పండుగ నరేష్ కుమార్ అనే వ్యక్తి నాంపల్లికి చెందిన రేగుల బలరాం అనే వ్యక్తి చెప్పిన మాయమాటలు నమ్మి ఎస్ఎస్ ఎకో మోటార్స్ మేనేజ్మెంట్ వారు ప్రవేశపెట్టిన గొలుసు కట్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి రూ.21 వేలు చెల్లించి స్కీమ్ లో చేరాడు.
మరలా అతడు మరో ముగ్గురిని ఈ స్కీములో చేర్పిస్తేనే అతనికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పడంతో అతడు మిగతా ముగ్గురిని చేర్పించలేక తన డబ్బులు తిరిగి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మోసపోయానని తెలుసుకొని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీస్ వారు రేగుల బలరాంతో పాటు ఎస్ఎస్ ఎకో మోటార్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి మంగళవారం బలరాంను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుమతులు లేకుండా చేసే చట్ట వ్యతిరేకమైన గొలుసుకట్టు స్కీమ్స్ నిషేధించడం జరిగినదని, ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఎస్ఎస్ ఎకో మోటార్స్ యాజమాన్యం చేతిలో మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలని ఎస్పీ సూచించారు.