నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
అధికారులు నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని తనం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. ఓ భార్యకు భర్త, నాలుగేళ్ల చిన్నారికి, పుట్ట బోయే బిడ్డ తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది.
దిశ, పరిగి : అధికారులు నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని తనం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. ఓ భార్యకు భర్త, నాలుగేళ్ల చిన్నారికి, పుట్ట బోయే బిడ్డ తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణం పోయి ఓ కుటుంబమే అనాధలుగా మిగిలిపోయింది. పరిగి నుంచి వికారాబాద్వెళ్లే దారిలో నస్కల్ సమీపంలోని శాఖరవాగు వంతెన వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతల రోడ్డులో బైక్ పై నుంచి పడి బాల్‌రాజ్(28) తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. నస్కల్ వైపు నుంచి బాల్‌రాజ్ ఈనెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం పాఠకులకు తెలిసిందే. రెండు రోజుల పాటు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం మృతి చెందారు.
తన భర్త బాగై ఇంటికి రావాలని కోరుకుంటున్నా కుటుంబీకులకు చనిపోయాడన్న విషయం తెలియగానే కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు.. నాన్న ఇంటికి వచ్చేస్తాడులే అంటూ తన తండ్రి మరణం గురించి తెలియని చిన్నారి కుటుంబీకుల కన్నీళ్లు తుడవడం చూసిన వారందరికీ కన్నీరు పెట్టించింది. గర్బంతో ఉన్న భార్యను, నాలుగేళ్ల కూరుతురును బాల్‌రాజ్ దిక్కులేని వారిగా చేసి వదిలి పెట్టి మృతి చెందాడంటూ బాధ పడ్డారు. పేద కుటుంబంలో పుట్టి భార్య, పిల్లల్ని వదిలి ఇలా అకాలమరణం పొందిన బాల్‌రాజ్ కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కొసమెరుపు...
బాల్‌రాజ్ మృతి చెందడానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్అంబ్‌బి అధికారులే కారణమణాలా... లేదా.. ప్రజల శ్రేయస్సుపై చిత్త శుద్ది లేని పాలకులే కారణమణాలా.. లేదా చివరకు హెల్మెట్లేకుండా బైక్ నడపటంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటూ చినపోయిన బాల్‌రాజ్ పైకే నెట్టి వేయాలా అన్నది పాఠకులు మీరే నిర్ణయించాలి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గుంతలో పడి ప్రాణాలు పోతున్న రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు, నస్కల్ గ్రామస్తులు కోరుతున్నారు. ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ధరించి మన ప్రాణాన్ని మనం కాపాడుకుందాం.