వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-08 12:40 GMT

దిశ,శేరిలింగంపల్లి : అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈ ముఠా చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ ఆరుగురు నిందితులు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) కె. నరసింహ్మా, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ వెల్లడించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముఠా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతుందని, ఈ ముఠా సభ్యులు సైబరాబాద్ కమిషనరేట్ లో (17), రాచకొండ కమిషనరేట్ లో (09), సంగారెడ్డి జిల్లాలో (05), మెదక్ జిల్లాలో (04), నల్గొండ జిల్లాలో 1 చోరీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. వీరు చోరీలకు పాల్పడే సమయంలో ఎవరైనా అడ్డం వస్తే ప్రాణాలను తీసేందుకు సైతం వెనకడుగు వెయ్యరని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) కె. నరసింహ్మా, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 6 కత్తులు, 2 సెట్ ల కట్టర్ లు,11.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Similar News