మేకల మండీలో ప్రాణం తీసిన చిన్న గొడవ..
మండల కేంద్రంలోని మేకల సంతలో బుధవారం జరిగిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్ళింది.
దిశ, మామడ : మండల కేంద్రంలోని మేకల సంతలో బుధవారం జరిగిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో మామడకు చెందిన షేక్ చాంద్ ( 57 )ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మామడకు చెందిన షేక్ చాంద్ గ్రామపంచాయతీ ద్వారా మేకల సంతను టెండర్ కు తీసుకొని మేకలు కొనుగోలు చేసే వారి వద్ద నుండి రసీదు ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు.
ఇదే క్రమంలో పెంబికి చెందిన శివరాత్రి మల్లేష్, రెడ్డి, ఎల్లాపూర్ కు చెందిన సాయన్నలు మేకలు కొనుగోలు చేసి వెళ్తుండగా షేక్ చాంద్ డబ్బులు అడగగా ప్రతివారం ఇతను వేధిస్తున్నాడని ఎలాగైనా చంపాలన ఉద్దేశంతో గొడవ చేసి, తలను బండరాయికి కొట్టడంతో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు బంధువులు జాతీయ రహదారిపై ధర్నా చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ నవీన్ కుమార్, ఎస్సై అశోకులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ మెరకు కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.