మణుగూరులో 12.82 కిలోల గంజాయి పట్టివేత
ఖమ్మం ఎక్సైజ్ అధికారులు 12.82 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
దిశ,మణుగూరు : ఖమ్మం ఎక్సైజ్ అధికారులు 12.82 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బుధవారం మండలంలోని గుట్టమల్లారం వద్ద ఖమ్మం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఏఈఎస్ తిరుపతి, సీఐ సుంకరీ రమేష్, సిబ్బంది కలిసి కాపుకాసి సీలేరు నుంచి 12.82 కేజీల గంజాయిని రెండు బైకులపై తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు రథంగుట్ట అర్బన్ పార్కు వద్ద పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు చెందిన రేగు సంపత్, నందమాల లవ్ కుమార్, బందేల్ సాయి కుమార్, బోడ వంశీ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఆ వ్యక్తులను విచారించగా ఒరిస్సా నుంచి 12.82 కేజీల గంజాయిని కొనుగోలు చేసి మహబూబాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన జానీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఏఈఎస్ తిరుపతి తెలిపారు. ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు. అలాగే రెండు బైక్‌లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈఎస్టీఎఫ్ టీంలో హెడ్ కానిస్టేబుల్ ఎండీ. ఆరీఫ్, కానిస్టేబుళ్లు సుధీర్, హన్మంతరావు, హరీష్, వెంకటేష్, విజయ్ ఉన్నారు.