2 నెలలకే 'డబుల్ బెడ్ రూం'లకు పగుళ్లు

దిశ, ఎల్బీనగర్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్ రూం ఇండ్లు పథకం కొందరి నిరక్ష్యం కారణంగా మసకబారుతున్నది. జీహెచ్ఎంసీ అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల కక్కుర్తి, లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నది. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో తక్కువ సమయంలోనే గోడలకు పగుళ్లు వస్తున్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోతున్నాయి. వర్షం కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కరువై చిన్నపాటి వర్షాలకు సెల్లార్, స్లాబ్‌లపై నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ‘డబుల్’నిర్మాణాలపై దిశ […]

Update: 2020-08-16 20:21 GMT

దిశ, ఎల్బీనగర్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్ రూం ఇండ్లు పథకం కొందరి నిరక్ష్యం కారణంగా మసకబారుతున్నది. జీహెచ్ఎంసీ అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల కక్కుర్తి, లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నది. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో తక్కువ సమయంలోనే గోడలకు పగుళ్లు వస్తున్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోతున్నాయి. వర్షం కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయి. నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కరువై చిన్నపాటి వర్షాలకు సెల్లార్, స్లాబ్‌లపై నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ‘డబుల్’నిర్మాణాలపై దిశ కథనం.

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో ప్రభుత్వం రూ.25 కోట్లతో రెండు బ్లాకుల్లో కలిపి 268 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించింది. రెండు నెలల క్రితం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మల్లారెడ్డి చేతుల ఘనంగా ప్రారంభించారు. 154 మంది లబ్ధిదారులకు తాళాలను అందజేశారు. గృహ ప్రవేశం చేసిన లబ్దిదారులకు సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ప్రారంభించిన రెండు నెలలకే ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమస్యలపై సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

సమస్యలకు నిలయాలుగా..

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇండ్ల స్లాబులు, సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. సెల్లార్లో నీరు నిలువడంతో అక్కడే ఉండే విద్యుత్ మీటర్లు, జనరేటర్లు వద్ద గోడలకు కరెంట్‌షాక్ వస్తుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా, డస్ట్ను ఉపయోగించడంతో స్లాబ్‌పై నిలుస్తున్న నీటితో పగుళ్లు ఏర్పడి, పెచ్చులూడుతున్నాయి. గోడలకు నిమ్మొచ్చి కారుతున్నాయి. వర్షపు నీరు లిఫ్ట్లోకి చేరుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి లిఫ్ట్లోనే ఉండగా ఆగిపోయింది. దీంతో బాధితుడు గంటల తరబడి అందులోనే ఉండిపోయాడు. ఫైర్ సేఫ్టీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించకపోవడంతో ఫైర్ పరికరాలు దిష్టి బొమ్మలాగా మారాయని వాపోతున్నారు. డ్రైనేజీ పైపులైన్ పగిలిపోయి పొంగిపొర్లుతోంది. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో లబ్ధిదారులు సంచులను ఏర్పాటు చేసుకున్నారు. ఇండ్లకు ఉన్న మెట్లు రెండు నెలలకే సగం విరిగిపోయాయి. అంతేకాకుండా లిఫ్ట్కు ఏర్పాటు చేసిన తలుపులు విరిగిపోయి వేలాడుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమే?

ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇంత వేగంగా నిర్మించి అందివ్వడంతో స్థానికులు తొలుత హర్షం వ్యక్తం చేశారు. ఇండ్లల్లోకి చేరిన కొన్ని నెలలకే ఒక్కొక్క సమస్య నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నది. ప్రభుత్వం ఇంత ఫాస్టుగా ఇండ్లను నిర్మించి అప్పగించడానికి కారణం లేకపోలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకే డబుల్ బెడ్ రూం ఇండ్లను వేగంగా నిర్మించినట్లు సమాచారం.

వరండాలోకి వర్షం నీరు వస్తున్నది: స్వప్న, లబ్ధిదారురాలు, ఎరుకల నాంచారమ్మ బస్తీ.

వర్షపు నీరు వరండాల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఇంట్లోనూ బట్టలు ఉతికే గచ్చుమొత్తం పెచ్చులూడింది. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నాం. కిటికీలకు స్ర్కూలు సరిగ్గా బిగించలేదు. దొంగలు పడే అవకాశం ఉన్నది.

చూస్తాంలే అంటున్నరు: వెంకన్న, లబ్ధిదారుడు, ఎరుకల నాంచారమ్మ బస్తీ.

డబుల్ బెడ్‌రూం ఇండ్లలో నెలకొన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. కానీ చూస్తాంలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నిరుపేదల నివాసాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారు.

ఫోన్లు చేసినా స్పందిస్తలేరు: రాజు, లబ్ధిదారుడు, ఎరుకల నాంచారమ్మ బస్తీ.

ఇక్కడ సమస్యలపై అధికారులకు ఫోన్ చేసినా స్పందిస్తలేరు. హైవోల్టేజీ సమస్యతో ఇండ్లలోని ఫీజులు ఎగిరిపోయి, విద్యుత్ ఉపకరణాలు పనిచేయడం లేదు. విద్యుత్ అధికారులను ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. కరెంట్ సమస్యను పరిష్కరించాలి.

Tags:    

Similar News